Pages

Friday, March 30, 2012

Day89 - 290312 - Self treat



పుట్టిన రోజుకి, పెళ్లి రోజుకీ నాకు నేనే బహుమతులిచ్చుకుంటూ వుంటాను. అలా ఈ ఏడాది పెళ్లి రోజుకి ఇవి కొనుక్కున్నాను :)

Day 88 - 280312 - నాకు రెక్కలోచ్చేసాయోచ్


Day 87 - 270312 - మగ్గం వర్క్, Embroidery



చీరల మీదా, జాకెట్ల మీద వర్క్ చేసే/చేయించే వాళ్లకి ఎంత డిమాండ్ వుందో, వాళ్ళెంత ధర చెప్తే అంత నోరు  మూసుకుని ఇచ్చి రావాల్సిందే. అలా అని చెప్పిన టైం కి ఇస్తారా అంటే లేదు. రోజుకో కొత్త రకం వర్క్ fashion లోకి వస్తుంటే వీళ్ళకి చేతి నిండా పని.

Day 86 - 260312 - !"*$)_%^


నాకీ క్రీం ని బండబూతులు తిట్టాలని వుంది. ఎప్పుడూ సన్ స్క్రీన్ రాయని నేను మొన్నో రోజు ఎండకి ఎక్కడ కందిపోతానో అని బయటకి వెళ్ళేటప్పుడు ఇది రాసుకున్నాను. అంతే నా ముఖం మీద రాషెస్ వచ్చేసాయి. వారం పట్టింది మళ్ళీ మామూలు అవడానికి :(

Day 85 - 250312 - పండు గాడి ఉయ్యాల



అమ్మ వాళ్ళ ఇంట్లో ఉయ్యాల బల్ల, కేన్ (బుట్ట) ఉయ్యాల వున్నా, మా ఇంట్లో వాడి చిన్ని ఉయ్యాల వున్నా కూడా పండు గాడికి మా అవుట్ హౌస్ లో వుండే ఆంటీ వేప చెట్టుకి చీరతో కట్టిన ఉయ్యాల లో ఊగడం ఇష్టం.

Day84 - 240312 - చిరుగంటలు



చిరుగాలి వీచినప్పుడు ఈ గంటలు అటూ ఇటూ కదులుతూ తెచ్చే సవ్వడి నాకెంతో ఇష్టం. ఈ గంటలు పెద్ది చత్తీస్ గడ్ వెళ్ళినప్పుడు తెచ్చింది.

Day 83 - 230312 - నా చిట్టి కన్నయ్య



అందరికీ belated నందన నామ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఫోటో రెండేళ్ళ క్రితం ఉగాది రోజు తీసినది. అప్పుడు పండు గాడికి ఏడవ నెల. బొద్దుగా, బూరె బుగ్గలతో ఉండేవాడు. ఇప్పుడు ఆ బుగ్గలన్నీ పోయాయి. రోజు రోజుకీ బక్కచిక్కి పోతున్నాడు :(

Day 82 - 220312 - ఉయ్యాల బల్ల



ఈ ఉయ్యాల బల్ల తో నా చిన్నప్పటి జ్ఞాపకాలు చాలానే ముడిపడి వున్నాయి. ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వుండేది. సెలవులకి పిల్లలందరం వెళ్ళినప్పుడు దీని మీదే మకాం వేసేవాళ్ళం. దీని మీద చోటు కోసం పోట్లాటలు, అలకలు సాగేవి. అన్నాలు ఇక్కడే, ఆటలు ఇక్కడే, అల్లరీ ఇక్కడే. అమ్మ వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నాక ఈ ఉయ్యాల బల్లని అక్కడి నుండి తెచ్చి మా ఇంట్లో పైన హాల్లో పెట్టించారు. ఇక అప్పటి నుండి చాలా ఏళ్ళ పాటు అది అచ్చంగా నాకే ఉండింది. ఈ మధ్య అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కువ పైకి వెళ్ళట్లేదు కానీ వెళ్ళినప్పుడు మాత్రం దీని మీద కాసేపు కూర్చుని వస్తుంటా.

Day 81 - 210312 - ఆయుర్వేదం - నా కొత్త ప్రయోగాలు



మా ఎదురింట్లో వుండే ఆంటీ అంటే నాకు చాలా ఇష్టం. చాలా కొద్ది రోజుల్లో ఆమె మాటలకి, ప్రవర్తనకి, అలవాట్లకి ముగ్దురాలినయిపోయాను. ఆమె వాళ్ళ ఇంట్లో పిల్లలకి చిన్నప్పటి నుండి జంక్ ఫుడ్ అలవాటు చెయ్యలేదు. అలానే అల్లోపతి మెడిసిన్ అత్యవసరమయితే తప్ప మామూలు సమయాల్లో కేవలం హోమియో మరియూ ఆయుర్వేదిక్ మందులు మాత్రమే  వాడుతుంటారు.  వాళ్ళ పిల్లలు కూడా బాగా ఆరోగ్యంగా వుంటారు(TW,TW,TW). ఆమె సలహా విని నేను కూడా కొన్ని ఆయుర్వేదిక్ మందులు, సోప్స్, షాంపూ తెచ్చుకున్నా :) ఇల్లే ఒక వైద్యశాల, ఇల్లాలే ఒక వైద్యురాలు  అవాలి   అంటుంటారు ఆయుర్వేదాన్ని బోధించే వారు. ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం అనుకుంటున్నాను.

Tuesday, March 20, 2012

Day 80 - 200312 - పెళ్లి మేళం



ఈ డ్రమ్స్ కొనిచ్చాక ఇల్లంతా హోరేత్తించేస్తున్నాడు. వాడు మేళం వాడట, పెళ్ళికి వాయిస్తున్నాడట. గోల భరించలేక ఆ సంత అంతా అమ్మ వాళ్ళింట్లో వదిలేసి వచ్చా. అమ్మ ఒకటే గోల "మాకు మాత్రం గోల కాదా, తీసుకెళ్ళి మీ ఇంట్లోనే పెట్టుకో" అని. మా ఇంట్లో అయితే వారానికి ఆరు రోజులు భరించాలి. అమ్మ వాళ్ళింట్లో అయితే ఆదివారమొక్కటే కదా అని అక్కడే వదిలేసి వచ్చాను. వీడు నిన్నంతా అడిగి ఈ రోజుకి ఊరుకున్నాడు.

Day 79 - 190312 - తెల్ల గులాబీ


Day 78 - 180312 - పెరటి కూరగాయలు



మా అత్తగారి ఊర్లోని మా ఇంట్లో బోల్డంత ఖాళీ స్థలం వుంది. మా అత్తగారికి మొక్కలంటే ప్రాణం. అక్కడ ఇల్లు వదిలి సిటీకి వచ్చేసేటప్పుడు ఆ ఇంట్లో ఒక భాగం వేరే వాళ్లకి అద్దెకిచ్చి మొక్కలు, చెట్లు అన్నీ వాళ్లకి అప్పగించి వచ్చింది. అద్దె ఇవ్వకపోయినా పర్లేదు, మొక్కలు బాగా చూసుకోండి అని చెప్పిందిట.పాపం వాళ్ళూ ఎన్నో ఏళ్ళుగా ఆమె నాటిన చెట్లు, మొక్కలన్నిటినీ బాగా చూసుకుంటున్నారు. పోయిన ఏడాది నుండి కూరగాయలు కూడా వేస్తున్నారు. మేము ఊరెళ్ళినప్పుడు ఆ కూరగాయలని అపురూపంగా కోసి తెచ్చుకుంటాము. మొన్న ఆదివారం వెళ్ళినప్పుడు నేను, మా అత్తగారు, తోడి కోడలు ముగ్గురం కాసిన కూరగాయలన్నిటినీ ఒక కుప్పలా వేసుకుని ఇంద్ర సినిమాలో బ్రాహ్మి, MS , ధర్మవరపు సుబ్రహ్మణ్యం నగలు పంచుకున్నట్టు "ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు.." ఇలా అనుకుంటూ పంచుకుని తెచ్చుకున్నాం :) పెరటి తోటలోని కూరగాయలతో చేసే వంటల్లోని రుచి బయట కొన్న కూరలతో రాదు. అది ఈ మధ్యే తెలుస్తోంది నాకు. ఈ సారి వెళ్ళినప్పుడు కొన్ని గింజలు కూడా తెచ్చుకుని అమ్మ వాళ్ళింట్లో నాటించాలి (మా ఇంట్లో స్థలం లేదు, సరయిన protection వుండదు). ఈ మాట అంటే మా నాన్న "హు, అయితే ఇంకొన్ని రోజుల్లో నేను తోటమాలి అవతారం ఎత్తాలన్నమాట" అన్నారు. అమ్మ ఈ మధ్య తోట పని చెయ్యలేక వదిలేస్తోంది మరి. ఇంట్లో పని చేసే ఆమెకి అంత శ్రద్ధ వుండదు కదా. కనుక నాన్న చెయ్యాల్సిందేగా.వారానికోసారి నేనెళ్ళి ఎలా వున్నాయో చూసి, నా వాటా తెచ్చుకుంటానన్నమాట :D

Day 77 - 170312 - మినీ మేళా



 మా వాడికి బ్రేక్ బాక్స్ లో ఏది పెట్టాలన్న వాడి సైజు కి తగ్గట్టుగానే పెట్టాలంటాడు. ఇడ్లీ, దోశ, చపాతీ, అట్టు,బోండా, ఉతప్పం ఏదయినా సరే "అమ్మ, చిన్నవి పెట్టు" అంటాడు. ఇవి మినీ అట్లు :)

ఈ రోజుటికి మా పెళ్ళయ్యి ఎనిమిదేళ్ళు అయింది. ముగ్గురం కల్సి ఒక ఫ్యామిలీ ఫోటో తీయించుకుని పోస్ట్ చేద్దామనుకున్నా.కానీ మా అయన ఊరంతా తిరిగి ఇల్లు చేరేసరికి తొమ్మిదయ్యింది :( కనీసం కొత్త బట్టలు కట్టుకోవాలని కూడా అనిపించలేదు నాకు. ఎప్పుడెప్పుడు తనకి ఖాళీ దొరుకుతుందా, ఎటయినా వెళ్దామా అనిపిస్తోంది :(

Day 76 - 160312 - జున్ను ముక్కల కూర


మా వాడికి కోడి గుడ్డు మొత్తం కడుపులోకి వెళ్ళాలంటే ఏకైక మార్గం ఈ కూర చెయ్యడం. ఉడకపెడితే తెల్ల సొన తిని పచ్చ సొన ఊసేస్తాడు.ఆమ్లెట్ వేస్తే సగం తింటాడు. పోరుటు చేసినా గుడ్డు పూర్తిగా పోదు పొట్టలోకి.అందుకే వారంలో రెండు సార్లు ఈ కూర చేసి పూర్తి గుడ్డు తినేలా చేస్తున్నా. ఇందులో అయితే జున్ను ముక్కలు వుంటాయి కదా, వాటిని గుడ్డు కేక్స్ అనుకుంటూ తింటాడు.

Day 75 - 150312 - కమ్మని నెయ్యి



నేను బాగా ఇష్టంగా చేసే పనుల్లో వంట ఒకటి. ఒంటికి పట్టే ఆహారం వండే విషయంలో అశ్రద్ధ అస్సలు చెయ్యలేను (తిండి పిచ్చి కూడా వుంది కదా, అది పైకి చెప్పుకోకూడదు). ఈ మీగడ చిలకడం, వెన్న తియ్యడం, నెయ్యి కాచడం ఈ పనులన్నీ నువ్వెందుకు చేస్తావు, పనమ్మాయి చేత చేయించుకోవచ్చు కదా అంటాడు మా ఆయన.తన దృష్టిలో నేను పనామెకి బోల్డంత జీతమిస్తూ కూడా పూర్తిగా ఆమె సేవలని ఉపయోగించుకోలేని అసమర్దురాలిని. చాలా మందితో పోలుస్తూ నన్ను తెగ విసిగిస్తూ ఉంటాడు. అయినా నా దారి నాదే. నా చేతులతో నేను చేసుకుంటేనే నాకు సంతోషం, తృప్తి. అందులోనూ ఈ నెయ్యి చేసే పనంటే నాకు చాలా చాలా ఇష్టం. అంతా పూర్తయ్యాక స్టీలు టిఫిన్ కేన్ నిండా వచ్చిన నెయ్యి నుండి వచ్చే ఆ కమ్మటి వాసన ఇంకా ఎంతో ఇష్టం. నెయ్యి కాచిన చట్టి లో అడుగున వుండే గోదారి లో అన్నం, కరివేపాకు కారం వేసి కలిపి ముద్దలు తింటుంటే ఎంత బాగుంటుందో.పండు గాడు కూడా నేను ఈ పని చేస్తుండగా అస్సలు విసిగించకుండా పక్కనే
ఉండి హెల్ప్ చేస్తుంటాడు. మూతి నిండా వెన్న పూసుకుని ముద్దు ముద్దుగా కబుర్లు చెప్తూ, ఉత్తుత్తి  వంట చేస్తూ ఉంటాడు.

Wednesday, March 14, 2012

Day 74 - 140312 - పుత్తడి కాదు, ఇత్తడే :)


ఈ రోజు మా ఊర్లో కళ్యాణ్ jewellers షాప్ ఓపెనింగ్ వుంది. ఎక్కడ చూసినా అవే ads.

ఈ గిన్నెల్లో పాలు పొంగించాము. పాత కాలంలో ఇత్తడి గిన్నెల్లో పాలు కాచేవారు కదా. ఇప్పుడు నేనూ ఇవే వాడదామని అనుకుంటున్నాను. Any suggestions ?

Day 73 - 130312 - గోవు మాలక్ష్మి



ఈ ఆవు చాలా సాఫ్ట్ కానీ దూడ మరీ రౌడీ పిల్ల. పసుపు, కుంకం బొట్టు పెట్టడానికి నానా తంటాలు పడ్డాను. రెండూ చక చకా నాలుగు అంతస్తులు ఎక్కేసాయి. ప్రాక్టిసు కోసం ముందు రోజే నాలుగయిదు సార్లు ఎక్కించి దించారుట :)

Day 72 - 120312 - గృహప్రవేశం పూజ



మేము కూడా ఒక ఇంటి వాళ్ళం అయ్యామోచ్!

Day 71 - 110312 - తందూరీ లెగ్స్



మా అమ్మ మా తమ్ముడు వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు ఎప్పుడూ ఈ లెగ్స్ అస్సలు చెయ్యదు. నేనూ, నాన్న ఎంత అడుక్కుతిన్నా చెయ్యదు. ఈ ఆదివారం మా తమ్ముడి దయ వలన మాకు ఇవి ప్రాప్తించాయి. నాకు మామూలు చికెన్ కర్రీ పెద్దగా నచ్చదు . ఇలాంటి ఫ్రైడ్ items ఇష్టం. లాక్కుని, పీక్కుని నరమాంస భక్షకిలా తినడం ఒక సరదా. అప్పుడప్పుడూ ఒక  ఆలోచన వస్తుంటుంది నాకు,  పెళ్లి చూపుల్లో ఈ స్నాక్ పెడితే ఎలా ఉంటుందా అని?

Day 70 - 100312 - మధురమయిన తొలి జ్ఞాపకాలు


Day 69 - 090312 - నాకు నచ్చిన చీర



మా గృహప్రవేశం కోసం మా తోడి కోడలికి పెట్టడానికి చీర కొనడానికి వెళ్ళాము నేను, అమ్మా. అక్కడ ఈ చీర నాకు తెగ నచ్చేసింది. ఇది నేను కొనుక్కుని, స్వాతి కి మరోటి కొందామనుకున్నా. కానీ తనకి పెట్టేటట్టుగా  వేరే ఏ చీరా నచ్చలేదు. స్వాతి కి కూడా ఇలాంటి చీరలు ఇష్టం. అందుకని అమ్మ తనకి ఇది పెట్టేయ్యమంది. నాకయితే అస్సలు మనసొప్పలేదు. నాకు నచ్చిన కలర్ లో సింపుల్ గా బాగుండింది నా కళ్ళకి. కానీ అమ్మ క్లాసు పీకింది, " ఎదుటి వాళ్లకి పెట్టే చీరలు బాగుండాలి, వాళ్లకి నచ్చేలా వుండాలి, ఇలాంటిది మళ్ళీ ఎక్కడో చోట దొరక్కపోదు, ఇచ్చెసెయ్యి తనకి" అని :) ఇక చేసేది ఏముంది, ఒప్పుకున్నాను. కానీ నాకు మాత్రం బాగా తెల్సు ఇలాంటి చీర ఈ రంగులో నాకు మళ్ళీ దొరకదని. ఒక వేళ దొరికినా స్వాతి దగ్గర వుంది కదా, మళ్ళీ నాకూ ఇదే ఎందుకు అని కొననేమో కూడా.దేనికయినా ప్రాప్తం వుండాలి :(

Day 68 - 080312 - ములక్కాడల పప్పుచారు



మా అత్తగారి వేపు పప్పుచారు, సాంబారు వేరు వేరు కాదు. వాళ్ళు చేసేది పప్పు చారే అయినా దానిని సాంబారు అనే అంటారు. మా ఆయనకి అది సాంబారు కాదు, సాంబారులో సాంబారు పొడి వేస్తారు.మీ అమ్మ వాళ్ళ ఇంట్లో చేసే పప్పు చారు లో సాంబారు పొడి వెయ్యరు, దాన్ని పప్పు చారు అంటారు అని ఎన్ని సార్లు చెప్పినా వినడు. సరే ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నా కొడుకు కూడా దీన్ని సాంబారు అనే అంటున్నాడు :( వాడికి సాంబారు పొడి వేసి సాంబారు చేస్తే నచ్చలేదు. పప్పు చారు వాడికిష్టమయిన వంట. కానీ దాన్ని సాంబారు అనే అంటాడు.

పాపం వాడికి వారం పది రోజుల నుండి జ్వరం వుండటం వలన రోజూ రసమే చేసాను. మాకు వేరే కూరలు చేసుకునే ఓపిక, ఆసక్తి లేక మేము కూడా రోజూ పచ్చడి, చారు తోనే కానిచ్చేసాము. లేదా బయట కర్రీ తెప్పించేదాన్ని. ఈ రోజే కొంచెం నా సాధారణ కుకింగ్ మోడ్ లో కి వచ్చి పప్పు చారు చేసాను.

స్కూల్ కి వెళ్ళే ముందు ఆర్డర్ వేసి వెళ్ళాడు, "అమ్మా, నేనూ స్కూల్ నుంచి వచ్చి సాంబార్ తింటా, రెడీ ఉంచు" అని. వచ్చాక మాత్రం రెండు ముద్దలు తిని వదిలేసాడు. ఇంకా పూర్తి స్థాయి ఆకలి వెయ్యనట్టుంది వాడికి :(

Thursday, March 8, 2012

Day 67 - 070312 - రంగు రంగుల చేపలు



ఈ రోజు ఏ ఫోటో తీయాలో తోచలేదు. అందుకే మా క్యాలెండర్ లో చేపలని ఫోటో తీసా :) అదే ఒక ఫోటో, మళ్ళీ నువ్వు తీసేదేంటి అంటే నేనేం చెప్పలేను...ఏంటో అలా తోచింది, తీసేసా అంతే.

Day 66 - 060312 - గౌతమ బుద్ధుడు


బుద్ధుడి గురించి, buddhism గురించి చాలా తెల్సుకోవాలన్న ఆసక్తి వుంది కానీ ఏంటో వీలు చేసుకోవట్లేదు నేను. ఈ ఫోటో Haailand లో తీసింది.

Day 65 - 050312 - చిరుతిళ్ళు



ఒకప్పుడు వారానికో, పది రోజులకో అమ్మ వాళ్ళు వంటింట్లో కిందా మీద పడి సాయంత్రం తినడానికి లడ్డు,గవ్వలు,మైసూరు పాక్ లాంటి స్వీట్లు, జంతికలు, చక్కలు, చేగోడీలు లాంటి కర కరలాడే స్నాక్స్ తయారు చేసేవారు. ఇప్పుడు అంత ఓపిక, టైం ఉండట్లేదు ఎవరికీ. బయట స్వగృహ లో కొద్ది కొద్దిగా కొనేసుకుని రెండు రోజుల్లో తిని అవగొట్టేయ్యడమే.
నాకు అమ్మమ్మ అప్పుడప్పుడూ పంపిస్తూ వుంటుంది ఇలా ఇంట్లో చేసినవి.ఈ సారి మా అత్తయ్య చేసి పంపించింది. లడ్డూ, జంతికలు. నా కోసం షుగర్ తక్కువ వేసి వేరేగా కొన్ని లడ్డూలు చేసి పంపించింది. మనకోసం వేరే వాళ్ళు చేసే ఇలాంటి పనులు బోల్డంత సంతోషాన్నిస్తాయి కదా.

Day 64 - 040312 - IV


Antibiotic injections చాలా నొప్పిగా ఉంటాయని IV పెట్టించాము. పీకేస్తాడేమో అనుకున్నాము కానీ పాపం వుంచుకున్నాడు. ఇది లేకపోతే injection వేసినప్పుడు నొప్పి వస్తుంది అని చెప్పాము, అర్ధం చేసుకున్నాడు. ఏంటో ఈ పిల్లలు :( ఆ జ్వరమేదో నాకు రాకూడదా? దుక్కలా వున్నాను. అసలే బక్క పిల్లాడు..ఈ జ్వరంతో ఇంకా తగ్గిపోయాడు.

Day 63 - 030312 - హమ్మయ్య, ఓ పనయిపోయింది :)


రెండేళ్ళ క్రితం పుస్తకాలు కొనడం మొదలు పెట్టినప్పుడు వాటికి అట్టలు వేసుకుందాం అనుకున్నా. మొదట్లో అమ్మ నేను వేసిస్తాను అంటే "ఛీ, నేనేమన్నా చిన్న పిల్లనా నీతో అట్టలు వేయించుకోడానికి, నేనే వేస్కుంటా" అని ఫోజు కొట్టాను. సరే నీ ఖర్మ అనుకుంది అమ్మ. చాలా కాలం పాటు వాయిదాలు వేసి వేసి ఆఖరికి తల్లీ నువ్వే దిక్కు అంటే పాపం ఈ రెండేళ్లలో కొన్న పుస్తకాలన్నిటినీ పట్టుకెళ్ళి కొన్నిటికి అట్టలేసి పంపించింది.

Day 62 - 020312 - మందుల అల్మారా


ఇది మా ఇంట్లో మందులు పెట్టుకునే అల్మారా. పండు గాడికి జ్వరం, జలుబు, దగ్గు :( వారం రోజులు పట్టి పీడించాయి. వీటిలో బోల్డన్ని మందులు వాడితే కానీ తగ్గలేదు.

Day 61 - 010312 - పాల క్యాలెండర్


వాడుకగా పాలు పోయించుకునే ప్రతి ఇంట్లో ఇలాంటి క్యాలెండర్ వుండే వుంటుంది కదా :)